వైతాళిక మౌనిలా

వేకువ రవికిరణంలా మెరిసే సుమలతా సౌరభమా..

ఆకుచాటు పసిడి పడుచు పెదవంచు చిరునవ్వు విరుల సరమా..

నవ వసంతానికి శ్రీ కారం చుట్టాలని సంకల్పించి..

కవన హారాల చెలిమి చెట్టుకు పాదులు వేసి..

మలయ మారుత పవనాల పెరట్లో తరువులు విడిచిన పత్రాలని..

తొలకరి పలకరింపులతో వొళ్ళంతా పొడుచుకున్న పచ్చబొట్లని..

కాయకష్టాన్నే నమ్ముకున్న ఆత్మాభిమానపు కొమ్మల్ని..

గాయపడకుండా నీ మనో సరోవరంలో ఈదుతున్న వైతాళిక మౌనిలా..

ఆ ప్రకృతమ్మ ఒడిలో నడయాడుతూ మనుగడ సాగించేలా..

సుప్రభాత సుమధుర గానాంబుధిలో ఓలలాడుతూ..

అభయహస్త మొసగిన మాధవీలతా
నీ దేగా యీ అనంత జగతంటూ..

నా భవ్య హృదయాంతరాలలో జనించిన భావనల ప్రతిరూపంగా నిను కొలిచెద!

Comments